samanthakamani_header.jpeg

యజ్ఞం - విశ్వ వ్యాప్తo

ఒక యజ్ఞం ముగిసింది, విశ్వ వ్యాప్త సమయమాసన్నమైంది.హైద్రాబాద్ వచ్చిన తొలి రోజులలో( మార్చ్,2024), హోటల్ దసపల్ల లో పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం. కొత్త ఊరు, పాత స్నేహితుల సమక్షం , కొంత విలువైన సమయం గడపవచ్చు, కొన్ని జ్ఞాపకాలు పోగు చేసుకోవచ్చు అనుకుంటూ అడుగులు పడ్డాయి." ఇలా ,ఇంత గొప్పగా కూడా సభ నిర్వహణ చేయవచ్చా? "అన్న ఆశ్చర్యం తో పాటుగా, అసలు ఇంత కాలం నేను, ఏమేమి రాశాను? అన్న ప్రశ్న మెదడులో రేకెత్తింది.

బాల్యం నుండీ విస్తృతంగా చదివిన పాఠకురాలిని మాత్రమే !రచయిత అవుతాను అనే ఆలోచన ఏనాడూ లేదు, అయ్యాను. అనువాదం కూడా అంతే.కొంత కాలం "సుమన" పేరిట బ్లాగ్ నడిపాను, కారణాలు ఏవైనా కొనసాగింపు లేదు.వెబ్సైట్ చేస్తే, ప్రపంచంలో ఏ మూల వారికైనా అందుబాటులో ఉంటుంది ,నేను ఎక్కడ ఉన్నా కూడా ,సౌకర్యవంతంగా భవిష్యత్తు రచనలు చేయవచ్చు, అన్న భావన కలిగి, యజ్ఞం మొదలైంది. మా రైల్వే డిగ్రీ కాలేజీ వెబ్సైట్ వర్క్ చేస్తున్న బృందం సహకారం లభించింది

ఏప్రియల్,2024 లో" జ్వలిత, కామ్ పేరిట, వెబ్సైట్ డొమైన్ తీసుకున్నాము. ఫేస్ బుక్ లో ప్రకటన చేశాను.అదే పేరిట, వేరే వారికి కూడా వెబ్సైట్ ఉందని ఫేస్ బుక్ ద్వారానే,తెలిసింది.ఒకే పేరిట ( స్పెల్లింగ్ తేడా ఉండవచ్చు) రెండు సరి కాదు, అందుకే దానిని నా సామాజిక సేవా కార్యక్రమాల కోసం కేటాయించి ,నా సంతానం మరియు ఆప్తుల సలహా మేరకు samanthakamani .com పేరిట మరో సారి డొమైన్ తీసుకున్నాను..

రచనా వ్యాసంగం ప్రారంభించిన తొలినాళ్లలో,ఏమి రాస్తానో, ఎన్ని రాస్తానో తెలియదు.అసలా వైపు ఆలోచన కూడా లేదు.మొదటి నుంచీ చేతిరాత తో రాసేసి, కంపోజింగ్ బయట చేయించేదాన్ని, ఆ హార్డ్ కాపీ లు, పత్రికలలో పబ్లిష్ అయినవి ఒక ఫైల్ లో వేసి జాగ్రత్త చేసే దాన్ని. అలా, పాత వన్నీ తీసి ముందు పెట్టాను. దాదాపు 23 సంవత్సరాల రచనలు. పేపర్ రంగు మారింది, వేర్వేరు ఫాంట్ లలో ఉన్నాయి.అన్నీ కొత్తగా కంపోజ్ చేస్తే మంచిదన్న సూచన. చిర పరిచయస్తులు బాధ్యత తీసుకున్నారు. హైద్రాబాద్ నుండీ పి డీ ఎఫ్ చేసి పంపేదాన్ని.కంపోజ్ అయిన వాటిని, ప్రింట్ తీసి , కరెక్షన్స్ చేసి వాట్సాప్ లో తిరిగి పంపేదాన్ని.రెండు/ మూడు ప్రూఫ్ రీడింగ్ లయ్యాయి.కొన్ని ముఖ్యమైన రచనల సాఫ్ట్/ హార్డ్ కాపీలు మిస్ అయ్యాయి. వాటి సేకరణ మాత్రం నిజంగా ఇబ్బంది అయ్యింది. రచనల విభాగాల విషయంలో మాత్రం కష్టపడ్డాను.అవే"సమన్విత, అనువాద మిత్ర మండలి, గుండమ్మ డ్రామా కంపెనీ , జ్వలిత.కామ్..."మరలా సబ్ కేటగిరీలు. ఈ క్రమంలోనే దాదాపు 15 పుస్తకాలు కూడా తేలాయి. భవిష్యత్ లో బుక్ రూపంలో తీసుకు రావచ్చు అని సాహితీ మిత్రుల సలహా! అవే 1) క్రీడావని 2)ఆకాశమంత -02. 3)ధీర 4) మనసా తుళ్ళి పడకే 5) బుధ్ధి ధాత్రి 6) శ్యామ్ ది ట్రావెలర్ 7) కృష్ణ ప్రియ ( ప్రథమ , ద్వితీయ భాగాలు )8) అనువేదం 9)సాంస్కృతిక వారధి 10) రంగస్థల రమణీయo ప్రథమ, ద్వితీయ, తృతీయ భాగాలు. ఈ క్రమంలోనే సంపాదకురాలుగా " అనుస్వరం 2025 "రూపుదిద్దుకున్నాయి.

కవర్ పేజీ,ఏమి వేస్తే బావుంటుంది? అన్న ఆలోచన వద్ద, నాలో ఒక స్పీడ్ బ్రేక్ పడింది.పుస్తకం లో,రచయిత పేరు, ఫోటో ఎక్కడో ఒక చోట ,ఎలానూ ఉంటుంది, అసలు నా ఫొటోల తోనే కవర్ పేజీ తోనే ఎందుకు వెయ్యకూడదు?అనుకున్నాను..అలా టైటిల్ పేజీ,నా రచనలతో బ్యాక్ పేజీ డిజైన్ అయ్యింది.భవిష్యత్ లో నేను రాయబోయే కొన్ని పుస్తకాల కవర్ పేజీలు కూడా ముందస్తుగానే, డిజైన్ చేయించాను.

పుస్తకాలలో ముందు మాట కు అంత ప్రాధాన్యత ఇవ్వని నేను , నా రచనా వ్యాసం గాన్ని,నా సాహితీ మిత్రులు ఎవరైతే, ఆది నుండీ గమనిస్తూ ఉన్నారో,వారు కూడా నా వెబ్సైట్ లో ఉండాలి అనుకుని అప్తవాక్యాలు అందించమని కోరాను.కాస్త కాలం తీసుకున్నా , రాశారు.తమ పని ఒత్తిడి వల్ల,ఒకరిద్దరు, ఈ నాటికీ ఇవ్వలేక పోయారు.భవిష్యత్తులో పంపితే, దానిని కూడా పొందుపరచడం జరుగుతుంది

తొలుత 30.10.24 న అనుకున్నాం , పని అవ్వలేదు. తర్వాత 04.04 .25 గా భావించాం,సాధ్యంకాలేదు.25.06.25 కూడా కుదరలేదు.30.10.25 న ఎలాగైనా ఆవిష్కరణ జరగాలి అనుకున్నాము ,మరలా ఏవో అవాంతరాలు.. " అమ్మ" గా జన్మ నెత్తిన, జనవరి తొమ్మిదో తారీఖున కొత్త సంవత్సరం లో (2026) ఖచ్చితంగా అంతర్జాలం లోకి ప్రవేశించాల్సిందే! అనుకున్నాను. అనుకోకుండా అది కాస్త ముందుకు జరిగి, 30.12.25, మంగళ వారం, ప్రపంచం ముందుకు వస్తుంది

నా కలం నుండీ జాలువారిన సాహిత్యం,నా కృషి,నేను ఉండగానే ఒక చోట నిక్షిప్తం చేయాలన్న ఆలోచన మాత్రమే నా వ్యక్తి గత వెబ్సైట్ రూప కల్పన కు మూలం, సత్యం.సమాజం నుండీ ఎదురయ్యే పొగడ్తలు, విమర్శలు నాకు పట్టవు, అంటవు, ఎందుకంటే అంతరాంతరాలలో ఉన్న అభిప్రాయం ,భావజాల వైరుధ్యం ఉంటుంది, పబ్లిష్ అయిన రచనలను సైతం మార్చలేము

ఈ పని జరుగుతున్నంత కాలం, నా అక్షరాల ద్వారా, అమాయకత్వం, సాంప్రదాయ కట్టుబాట్ల నుండీ మార్పు చెందిన నా జీవన పరిణామాన్ని తిరిగి చూసుకునే అవకాశం కలిగింది.నేను అనుభవించిన జీవితం పట్ల ,నాకు సంపూర్ణమైన సంతృప్తిని కూడా ఇచ్చింది.ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎందరు ఎన్ని మోసాలు చేసినా, ఆర్ధిక నష్టాలు కలిగినా, నేను నిలదొక్కున్నాను. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించలేకపోయినప్పటికీ, పోరాట పటిమే నన్ను నడిపించింది.ఇది ప్రపంచ ప్రఖ్యాతి గాంచే విషయం కాదు, దేశ ఉన్నతి పెంచే విషయం అంత కన్నా కాదు.కానీ సాoప్రదాయ మధ్య తరగతి కుటుంబం లో పుట్టి, సాధికారత వైపు ఒక ఆడపిల్ల చేసిన ప్రయాణం..అందుకే " innocence to empowerment" అన్న ట్యాగ్ లైన్ ఇవ్వడం జరిగింది.క్రీడాకారిణి గా, కళాకారిణి గా,రచయిత్రి గా, అనువాదకురాలిగా,సంపాదకురాలి గా, కార్యక్రమ నిర్వాకురాలిగా, నేను చేసిన పయనంలో ఏదీ నేను ముందు నిర్ధారించుకోలేదు. అలా కాలం గడిచిపోయిందంటే ప్రధాన కారణం ఎప్పటికప్పుడు నా ముందు ఉన్న టార్గెట్.ప్రతి పనీ ముగిసిన తర్వాత,నా పెదాలపై మెరిసే దరహాసం కోసం నేను పడిన తపన తో బాటు, నన్ను, నన్ను గా అర్థం చేసుకుని నాతో ప్రయాణం చేసిన మిత్ర బృందం, అధికారులు,సహోద్యోగ సమూహం,ఆత్మ బంధువుల సహకారం నన్ను నిలబెట్టాయి .

నా ఈ యజ్ఞం లో భాగస్వాములైన వారికి నా ధన్యవాదాలు అనడం కృతకంగా ఉంటుంది.. వారందరూ, నా అక్షరాల బారుల్లో, నా జీవనయానంలో అంతర్భాగం.......{ఇక్కడ bullets రావాలి)ఆలోచన అంకురార్పణ కర్త - శ్రీ గోళ్ళ నారాయణ గారు గారు, *వెబ్సైట్ నిర్మాణ కర్త శ్రీ వసీం గారు, కంపోజింగ్ వర్క్ చేసిన సునీతా గ్రాఫిక్స్, విజయవాడ వారు*, తుది మెరుగులు దిద్దిన శ్రీమతి ధనలక్ష్మీ గారు, హృద్యమైన కవర్ పేజెస్ డిజైన్ చేసిన శ్రీ అరసవిల్లి గిరిధర్ గారు,*ఆప్త వాక్యాలు అందించిన శ్రీ . కె.సత్య రంజన్ గారు, *శ్రీ కలిమి శ్రీ గారు,.జి, సాంభ శివ రావు గారు ( కలపర్రు సాంభా),* డాక్టర్ ప్రగతి గారు ,*శ్రీమతి వడ్లమూడి పద్మావతి గారు *, శ్రీమతి శాంతి శ్రీ, గారు,*సర్వ కాల సర్వావస్థలలో నా తోడుగా ఉండి "మాతాజీ!రచయిత్రి గా నీ సంతకం ఎక్కడ"అని దశాబ్దం కిందటే ప్రశ్నించిన సాకేత్ , *అమ్మ ఏమి రాసిందా అని చేతి ప్రతులు/ చెత్త పేపర్ లు ఆత్రంగా చదివేసి,నిర్మొహమాటంగా అభిప్రాయం వ్యక్త పరుస్తూ తన పేరుకు తగ్గట్టుగా, వీలు కుదిరినప్పుడల్లా కవిత్వం రాస్తున్న సాహిత్య కు... ఆత్మీయ అక్షరాలింగనాలతో.... శమంతక మణి.